శక్తి సహితమే శివం – శక్తి రహితమే శవం : తాడేపల్లి హనుమత్ ప్రసాద్

  • ఘనంగా ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
  • ప్రశాంత్ నగర్ బస్తీలో కన్నుల పండువగా విజయదశమి ఉత్సవం

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఆవిర్భవించి 100 వసంతాలు పూర్తయిన సందర్భంగా శేరిలింగంపల్లి ప్రశాంత్ నగర్ బస్తీలో శతజయంతి వేడుకల‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం విజయదశమి ఉత్సవం కన్నుల పండువగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో సాహితీ విద్యాసంస్థల చైర్మన్ డిబి రావు ముఖ్యఅతిథిగా, వనవాసి కళ్యాణాశ్రమం ప్రాంత సహ కోశాధికారి తాడేపల్లి హనుమత్ ప్రసాద్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం ఎన్నో దాడులను ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగిందని అన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి పోరాటం చేసేలా సమిష్టి భావన పెంపొందించాలనే ఉద్దేశంతో 1925 లో డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించారని అన్నారు.

నాటి నుండి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లను, పరీక్షలను ఎదుర్కొని ఆర్ఎస్ఎస్ శత వసంతాలను పూర్తి చేసుకున్నదని అన్నారు. ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభ‌వించినా మొదట సేవలో నిమగ్నమయ్యేది స్వయం సేవకులేనని అన్నారు. నాటి దివిసీమ ఉప్పెన అయినా, నిన్న‌ మొన్నటి కరోనా విపత్కర పరిస్థితులైనా సంఘ కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో బాధ్యతగా వ్యవహరించారన్నారు. శక్తి సహితమే శివం శివం, శక్తి రహితమే శవం శవం కాబట్టి అందరూ సంఘటితమై ఉండాలన్నారు. అందుకోసం ఐదు అంశాలను సూచించారు. 1. కుటుంబ విలువలు కాపాడాలి. 2. స్వదేశీ వస్తువులను వాడాలి. 3.పర్యావరణ పరిరక్షణ. 4.పౌర విధులకు కట్టుబడటం. 5.సామాజిక సమరసత అంటే అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉత్సవంలో భాగంగా మొదట ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది గణ వేష ధారి స్వయం సేవకులతో పాటు ఆదర్శనగర్ కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here