శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాలలో భాగంగా సేవా పక్షం కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రిపరేటరీ మీటింగ్ ను కొండాపూర్ మసీద్‌బండలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న సేవా పక్షం కార్యక్రమాలపై వివరణాత్మకంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 17న అన్ని జిల్లాల్లోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించాలని, సెప్టెంబర్ 18న విశ్వకర్మ జయంతి సందర్భంగా బహుజన బంధు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, స్వచ్ఛ భారత్ ను నిర్వహించాలని, యావత్ నియోజకవర్గంలో 2, 3 కిలోమీటర్ల మేర పాదయాత్రలు చేపట్టాలని, సెప్టెంబర్ 21న యోగా శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సెప్టెంబర్ 25వ తేదీన పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా మేళాలు, డిబేట్, క్విజ్ కాంపిటీషన్లు నిర్వహించాలని, క్రీడా పోటీలు ఏర్పాటు చేయాలని, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రదర్శించాలని, సెప్టెంబర్ 27న వ్యాస, క్విజ్, స్పీచ్ కాంపిటీషన్లను విద్యార్థులకు నిర్వహించాలని, 28వ తేదీన శ్రీమతి భారత మాత – వీరమాతలకు సత్కారం చేపట్టి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పాదయాత్రలు, శుభ్రత కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యకర్త సక్రియంగా పాల్గొని సేవా పక్షం ద్వారా బీజేపీ సిద్ధాంతాలను ప్రజలతో మమేకం చేయాలని, సేవే మా మంత్రం, సమాజ అభివృద్ధి లక్ష్యం అని పిలుపునిచ్చారు.
సేవా పక్షం రంగారెడ్డి జిల్లా కన్వీనర్ రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ సేవా పక్షం అనేది కేవలం పార్టీ ప్రోగ్రామ్ మాత్రమే కాకుండా సమాజంలో మార్పు తీసుకురావడానికి, ప్రతి కుటుంబానికి చేరడానికి, ప్రతి వర్గాన్ని స్పృశించడానికి ఒక వేదిక అని, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యం నింపేలా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విమోచన దినోత్సవ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, బోల్గాం యశ్పాల్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మూల అనిల్ గౌడ్, స్రవంతి, జిల్లా కార్యదర్శులు మణి భూషణ చారి, మాణిక్ రావు, దుర్గాప్రసాద్, జిల్లా కోశాధికారి కృష్ణంరాజు, సేవా పక్షం జిల్లా కో-కన్వీనర్ కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.





