క‌ల్వరి టెంపుల్ స‌తీష్ కుమార్ పై మియాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో కసిరెడ్డి ఫిర్యాదు..

శేరిలింగంప‌ల్లి, మే 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న క‌ల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు పి. సతీష్ కుమార్‌పై జంతు అక్రమ రవాణా, విదేశీ జాతి కుక్కల బ్రీడింగ్, విక్రయం, జంతు క్రూరత్వం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు జనం కోసం అధ్యక్షుడు క‌సిరెడ్డి భాస్కర రెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, విదేశాల నుంచి సైబీరియన్ హస్కీ డాగ్స్, జర్మన్ షెపర్డ్ డాగ్స్‌తోపాటు ఇతర జాతుల కుక్కలను స్మగ్లింగ్ చేసి, వాటితో భారీ స్థాయిలో బ్రీడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ఈ కుక్కల నుంచి పుట్టిన పప్పీస్‌ను లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇటీవల విశాలాంధ్ర, సిటీ టైమ్స్ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలు ఈ వ్యవహారాన్ని మరింత సంచలనంగా మార్చాయి. వృద్ధాప్యానికి చేరుకున్న సైబీరియన్ హస్కీ, జర్మన్ షెపర్డ్, ఇతర విదేశీ జాతుల కుక్కలను సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో వదిలేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బ్రీడింగ్‌కు పనికిరాని స్థితికి చేరిన తర్వాత వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల తీవ్రమైన వేసవిలో కొన్ని కుక్కలు మరణించాయని సమాచారం.

విదేశీ వాతావరణానికి అలవాటు పడిన ఈ జాతి కుక్కలు తెలంగాణలోని అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు లేకుండా వదిలేయడం జంతువులపై అమానుష చర్యగా పేర్కొంటున్నారు. అలాగే ఈ కుక్కలు గ్రామాల్లో తిరుగుతూ స్థానిక ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. క‌ల్వరి టెంపుల్ కేంద్రంగా అక్రమ బ్రీడింగ్, జంతువుల కొనుగోలు విక్రయాలు జరుగుతున్నాయనే అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. పీసీఏఏ, బీఎన్‌ఎస్, ఇతర చట్టాల ప్రకారం పి. సతీష్ కుమార్‌తోపాటు ఈ వ్యవహారంలో భాగమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క‌సిరెడ్డి భాస్కర రెడ్డి పోలీసులను కోరారు. జంతువులను కేవలం అక్రమ సంపాదన కోసం వినియోగిస్తూ వాటిపై క్రూరత్వానికి పాల్పడుతున్న వారిని వదిలిపెట్టకూడదని ఫిర్యాదులో స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here