మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో మంగళవారం నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు నిత్యం గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరులు, పగటివేషాలు నిర్వహించనున్నారు. నిత్యం ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకు శిల్పారామంలో కళాకారులు సందర్శకులను అలరిస్తారు.

ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు భోగి పండుగ సందర్భంగా నటరాజ్ ఆవరణలో 11 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు భోగి పళ్ల ఉత్సవం నిర్వహిస్తారు. ఔత్సాహికులు తమ పిల్లలతో వచ్చి కార్యక్రమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అలాగే నిత్యం శిల్పారామంలోని యాంఫీ థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
12వ తేదీన వైష్ణవి బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన, 13వ తేదీన చంద్ర శేఖర్ శిష్య బృందంచే గోదా కళ్యాణం నృత్య రూపకం, 14వ తేదీన డాక్టర్ గౌతమి రవిచంద్ర బృందంచే మార్గశిర మాస ప్రదర్శన, భరతనాట్య ప్రదర్శన, 15న ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన, 16వ తేదీన రవి శిష్య బృందంచే కూచిపూడి, డాక్టర్ పేరిణి రవి తేజచే పేరిణి తాండవం, సుబ్రత్ సర్కార్ చే కథక్ నృత్య ప్రదర్శన, 17వ తేదీన సుధీర్ రావు శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన లు ఉంటాయని అధికారులు తెలిపారు. కార్యక్రమాలకు సందర్శకులు హాజరు కావచ్చని తెలిపారు.





