శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ బి. బ్లాక్ లో డ్రైనేజీ సమస్య తీవ్ర రూపం దాల్చిందని, సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికంగా ఉన్న రైల్వే బ్రిడ్జి సమీపంలో, చర్చ్, మసీదు నుండి నల్ల పోచమ్మ ఆలయం వరకు మంజీరా వాటర్ వాల్స్, డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నిత్యం ఓపెన్ గా ఉంటున్నాయని అన్నారు. దీంతోపాటు రహదారులపై చెత్త చెదారం పేరుకుపోతుందని తెలిపారు. అయినప్పటికీ సంబంధిత జీహెచ్ఎంసీ విభాగం సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు డ్రైనేజీ నీరు రహదారులపై పొంగి పొర్లుతుందని, దీంతో పాదచారులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆరోగ్యం దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత విభాగం అధికారులు, సిబ్బంది ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.






