- అధికారులు పట్టించుకోవాలని స్థానికుల డిమాండ్
శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల వాసులు తమ కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్, రైల్వే బ్రిడ్జి పక్కన, ఏసుప్రభు, మసీదు ప్రాంతం, నల్ల పోచమ్మ ఆలయం రోడ్డు వద్ద నిత్యం డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుందని అన్నారు. వర్షం పడినా లేకపోయినా రహదారులపై డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుందని, దీంతో వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. డ్రైనేజీ నీటి వల్ల కాలనీలు, బస్తీల్లో దుర్వాసన వస్తుందని, దీని వల్ల స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారని వాపోయారు. ముఖ్యంగా డ్రైనేజీ వల్ల చిన్నారులకు నిత్యం నరకం కనిపిస్తుందని వాపోయారు. వారు పాఠశాలలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందన్నారు.

అలాగే కాలనీలు, బస్తీల్లో వీధి దీపాలు వెలగడం లేదని, దీని వల్ల రాత్రి పూట రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. కాలనీలు, బస్తీల్లో దోమల బెడద సైతం అధికంగా ఉందని, దోమలు కుట్టడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. కనుక సంబంధిత అధికారులు, సిబ్బంది ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కాలనీ, బస్తీ వాసులు కోరుతున్నారు.






