నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శేరిలింగంపల్లికి మంజూరైన సంచార మత్స్య విక్రయ వాహానాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం మియాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారు అనితరాజ్ ముదిరాజ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని నిరుద్యోగులకు, స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు రూ.10 లక్షల విలువ చేసే సంచార మత్స్య విక్రయ వాహనము అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ వాహనం విలువలో 60 శాంతం అంటే రూ.6 లక్షలు సబ్సిడీ మినహాయించగా లబ్దిదారు కేవలం 40 శాతం వాటా అంటే రూ.4 లక్షలు చెల్లిస్తే వాహనం సొంతమవుతుందని, ఆ మొత్తానికి సైతం బ్యాంకు రుణం లభిస్తుందని అన్నారు. నిరుద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.