శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు రాగం సుజాత యాదవ్ మృతి పట్ల మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నల్లగండ్లలోని మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వగృహానికి సబితా ఇంద్రారెడ్డి వెళ్లి, రాగం నాగేందర్ యాదవ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రాగం సుజాత యాదవ్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారతతో పాటు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాగం సుజాత యాదవ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాగం సుజాత యాదవ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






