- అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు – కట్టడి చేసిన పోలీసులు
- బడాబాబుల కోసమే ప్రభుత్వం తమను బలిచేసిందని బాధితుల శాపనార్థాలు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్‌పల్లి తండాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపన్‌పల్లి తండా నుంచి తెల్లాపూర్ వైపు రోడ్డు విస్తరణలో భాగంగా పలు నిర్మాణాలను అధికారులు కూల్చేవేశారు. దీంతో స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని కట్టడి చేశారు. ఈ క్రమంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
30 నుంచి 100 ఫీట్లకు రోడ్డు విస్తరణ…
గోపన్‌పల్లి తండా మీదుగా తెల్లాపూర్ వైపు ప్రస్థుతం ఉన్న 30 – 40 ఫీట్ల రహదారిని 100 ఫీట్లకు విస్తరించనున్న విషయం విదితమే. గతంలో ఈ రహదారి విస్తరణలో భాగంగా గోపన్‌పల్లి సర్వెనెంబర్ 34లోని 43 నివాసాలను, అదేవిధంగా ప్రైవేట్ సర్వే నెంబర్‌లోని మరో 15 నివాసాలను కూల్చివేయాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయా నివాసాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ప్రైవేట్ స్థలంలోని నివాసాలకు స్థలంతో పాటు నిర్మాణ వ్యయాన్ని, ప్రభుత్వ స్థలంలోని నివాసాలకు కేవలం నిర్మాణ వ్యయాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నష్టపరిహారానికి దూరంగా 41 నివాసాల యజమానులు…
ప్రభుత్వ స్థలంలో వెలిసిన 43 నివాసాలకు సంబంధించి నష్టపరిహారం చెల్లించే క్రమంలో ప్రభుత్వం యజమానుల ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, ఇతరాత్ర వివరాలు ఇవ్వాలని 2018లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐతే కేవలం రెండు నివాసాల యజమానులు మాత్రమే ఆ వివరాలు ప్రభుత్వానికి అందజేశారు. మిగిలిన వారు తమకు న్యాయం చేయాలంటు ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకుల చుట్టు తిరుగుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మిగిలిన 41 నివాసాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని అథారిటీలో జమచేసిన ప్రభుత్వం ఆయా నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
భారీ బందోబస్తు నడుమ ఉదయం 7 గంటల నుండే…
రెవెన్యూ యంత్రాంగం శనివారం ఉదయం 7గంటలకే రోడ్డు విస్తరణలోని నివాసాల కూల్చివేతను ప్రారంభించింది. చందానగర్, గచ్చిబౌలితో పాటు పరిసర పోలీస్‌స్టేషన్‌లకు చెందిన సిబ్బందిని పెద్ద మొత్తంలో రంగంలోకి దింపారు. భారీ సంఖ్యలో జేసీబీల సహాయంతో కూల్చివేతలకు తెరలేపారు. దీంతో స్థానికులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులను వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి కూల్చివేతలకు సహకరించాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన బాదితులు…
రోడ్డు విస్తరణను అడ్డుకోవచ్చు అనే బావనలో ఉన్న సదరు నిర్మాణ దారులు ఈ కూల్చివేతలతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఇళ్లు, వ్యాపారకేంద్రాలలోని వస్తువులను అప్పటిప్పుడు ఖాలీ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. తమకు అండగా నిలుస్థామని మాటిచ్చి ఓట్లు వేసుకున్న ప్రజాప్రతినిధులు న్యాయం చేయలేరంటు దుమ్మెత్తిపోశారు. బాడా బాబుల వెంచర్లకు మార్గం సుగమం చేసేందుకు తమలాంటి నిరుపేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వానికి తగిన శాస్తి జరుగుతుందంటు శాపనార్థాలు పెట్టారు.