నమస్తే శేరిలింగంపల్లి(హైదరాబాద్): మహాత్మ జ్యోతిరావు పూలే 195వ జయంతి ఉత్సవాలు అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో గల జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, బిజెపి జాతీయ ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, సిపియం నాయకులు మహెందర్, సిపిఐ నాయకులు బాలమల్లేష్, కత్తి వెంకటస్వామిలతో పాటు ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులు పాల్గొని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి ఘనంగ నివాళులర్పించారు.
అంబేద్కర్ కేవలం ఎస్సీల కోసం రాజ్యాంగం రాశారనే కుహనా వాదుల ఆలోచన మారాలి…
మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పాలకులు విలువలు మరిచారు కాబట్టే రిజర్వేషన్ల గూర్చి చర్చ జరుతుందన్నారు. సామాజిక అసమానతలు తొలగాలంటే చదువే శరణ్యమని బావించిన జ్యోతిరావుపూలే తన జీవితాన్ని పూర్తిగా మనకోసం త్యాగం చేశారని, ఆయన శిష్యుడు డాక్టర్ అంబేద్కర్ కేవలం ఎస్సీల కోసం రాజ్యాంగం రాశారని బావిస్తున్న కుహనా వాదులు మారాలని అన్నారు. ఈ దేశంలో సంపదను సృష్టిస్తున్నది పేదవారేనని, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం దారుణమన్నారు. అణిచివేత, అసమానతలు, కులవివక్ష ఎక్కడ వుందో అక్కడ తిరుగుబాటు మొదలవుతుందని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సక్రమంగా అమలు జరిగిన రోజే పేదల బతుకులు మారే వీలుందన్నారు. సమాజంలో చైతన్యం చచ్చిపోతే ఉన్మాదం మొదలవుతుందని హెచ్చరించారు.
పంజాగుట్ట చౌరస్తాలో అంబెడ్కర్ విగ్రహన్ని ప్రతిష్టించక పోతే ఆమరణ ధీక్ష చేస్తా…
మాజీ రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు మాట్లాడుతూ అగ్రకులాలతో సమానంగా ఉండాలంటే చదువు అవసరమని బావించిన మహనుబావులు జ్యోతిరావుపూలే అని కొనియాడారు.అంబర్పేట్ లో స్థలం ఉందని జ్యోతిరావు పూలే ఆడిటోరియం నిర్మించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఉగ్రవాది కాడని ఆయనను పోలీస్ స్టేషన్లో బందించారని విచారం వ్యక్తం చేశారు. అంబేద్కర్ అనేవారు లేకుంటే మన బతుకులు ఇలా ఉండేవి కావని, భారత దేశానికి దశ ధిష చూపిన గొప్ప వ్యక్తి అన్నారు. అంబెడ్కర్ విగ్రహన్ని పంజాగుట్ట చౌరస్తాలో ప్రతిష్టించక పోతే ఆమరణ ధీక్షకు పూనుకుంటనని హెచ్చరించారు.
నూతన జిల్లాలకు మహనుభావుల పేర్లు పెట్టాలి…
బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పచ్చనోట్లపై గాంధీ బొమ్మ ఎందుకు ఉన్నది పూలే అంబేడ్కర్ బొమ్మలు ఎందుకు లేవని ప్రశ్నించారు. పూలే కలలు కన్న రాజ్యం అటుంచితే అగ్రకుల నాయకులు చనిపోతే స్థలాలు కేటాయిస్తున్నారని నగరంలో ఘాట్లు, విగ్రహలు, పార్కులు, పోస్టల్ స్టాంపులు విడుదల చేస్తున్నారని, దళిత భహుజన నాయకులు చనిపోతే వారి చరిత్రలు కనుమరుగవుతున్నాయని ఆవేదన చెందారు. గొప్ప గొప్ప నిర్మాణాలకు అగ్రకుల నాయకులరి పేర్లు మాత్రమే పెడుతున్నారని అన్నారు. నూతన జిల్లాలకు మహనుభావుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుకు జ్యోతిరావు పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వచ్చే జయంతి నాటికి నగరంలో 10 ఎకరాల స్థలం కేటాయించి జ్యోతిరావు పూలే భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎల్.రమణ, డాక్టర్ లక్ష్మన్లు మాట్లాడుతూ పూలే భారతదేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసిసి సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్, మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకులు గడ్డం సాయి, మోర శ్రీరాములు ముదిరాజ్, కేవిపిఎస్ నాయకులు స్కైలాబ్ బాబు తదితరులు పాల్గొన్నారు.