లింక్ రోడ్ల ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న లింక్ రోడ్ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు ఎదుర‌వుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని కోరుతూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జి. సృజనకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ప్రజానీకం క‌లిగిన ప్రాంతంగా మారింద‌న్నారు. జ‌నాభా అధికంగా ఉండ‌డం, ఐటీ, కార్పొరేట్ సంస్థ‌ల‌కు నెల‌వు కావ‌డంతో ట్రాఫిక్ ర‌ద్దీ నిత్యం అధికంగా ఉంటుంద‌ని తెలిపారు. ట్రాఫిక్ ర‌ద్దీని తొల‌గించేందుకు లింకు రోడ్ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హైటెక్స్ గౌసియా కేఫ్ నుంచి కొత్త‌గూడ హ‌ర్ష ట‌యోటా వ‌ర‌కు 100 ఫీట్ల రోడ్డు ప‌నులు చేప‌ట్టాల‌ని, అపర్ణా హిల్ పార్క్ నుండి గంగారం చెరువు వద్ద హనుమాన్ దేవాలయం వ‌ర‌కు జాతీయ రహదారికి కలిపే లింక్ రోడ్డు పనులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు. ముంబై జాతీయ రహదారి BHEL కల్వర్టు నాలా నుండి శ్రీదేవి థియేటర్ రోడ్డుకు కలిపే లింక్ రోడ్డు పనులను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన లింక్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని కోరారు. దీనిపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సానుకూలంగా స్పందించిన‌ట్లు గాంధీ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here