శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని CR ఫౌండేషన్ లో స్వయం ఉపాధి శిక్షణ పొందుతున్న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని 35 కాలనీలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి కాలనీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయతోపాటు 5 ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. CR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా సంక్షేమ కేంద్రం ఆవరణలో జరిగిన ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, సి ఆర్ ఫౌండేషన్ ట్రెజరర్ వి. చెన్నకేశవ రావు మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. పోటీలలో విజేతల ఎంపికలో మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ జోస్యభట్ల కల్పన జడ్జిగా వ్యవహరించారు. ఈ పోటీలలో 75 మంది విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ కేంద్రం కమిటీ సభ్యులు వి. లలిత, వంక లక్ష్మి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.







