నమస్తే శేరిలింగంపల్లి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలను మియాపూర్ ఎస్ఆర్ ఎస్టేట్ కు చెందిన ఇంటర్ విద్యార్ధిని అడపా రాఖీ శ్రీదత్తా వినూత్నంగా నిర్వహించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని తాను పొదుపు చేసుకున్న డబ్బులతో జాతీయ జెండాలను కొనుగోలు చేసి హర్ ఘర్ తిరంగా ఇంటింటా జాతీయ జెండా పేరుతో జెండాలను వందల మంది బాలలకు అందజేసి తన దేశభక్తిని చాటుకుంది. పుట్టిన రోజు వేడుకల్లో దేశానికి స్వాతంత్ర్య సిద్దించి 75 సంవత్సరాలు వేడుక జరుగుతున్న సందర్భంలో జన్మదిన కేక్ కట్ చేసి తన తోటి స్నేహితులకు, చిన్నారులకు జాతీయ జెండాలు అందజేసి దేశభక్తి గీతాలు ఆలపించారు. స్వాతంత్య్రం కోసం అమరులైన వీరులను స్మరిస్తూ తన సహచర విద్యార్ధులతో కలిసి వందేమాతరం నినాదాలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఈ కార్యక్రమాన్ని తన శక్తిమేరకు బాలలతో నిర్వహిస్తానని రాఖీ శ్రీదత్తా అన్నారు.
