వరంగల్ (నమస్తే శేరిలింగంపల్లి): భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వంగల్ జిల్లా హన్మకొండ పట్టణ కేంద్రంలోని స్థానిక పివి చౌరస్తాలో జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గతంలో తాము తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేస్తూ రెండేళ్లుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 6,982 కి.మీ. యాత్ర ద్వారా పర్యటించి శాసన సభ్యులకు రెండు వందల పదహారు నియోజకవర్గలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ ని కలిసి వినతిపత్రాలను ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. భారత దేశ ఖ్యాతిని పీవీ ప్రపంచ దేశాలకు చాటారని, ఆయన వివాద రహితులని, అనేక పదవులను చేపట్టి వాటికి ఆయన వన్నె తెచ్చారని అన్నారు. ఆయనకు భారత రత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో సామాజిక వేత్త వలస సుభాష్ చంద్రబోస్ నేత, పీవీ నరసింహారావు అభిమాని పెరుమండ్ల రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.





