మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు జలమయంగా మారి వాహనదారులకు, పాదచారులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఎంసీపీఐ(యూ) మియాపూర్ డివిజన్ కార్యదర్శి కన్నా శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం డివిజన్ పరిధిలోని రహదారులపై చేరిన వరదనీటిలో ఆ పార్టీ నాయకులు నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నా శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల జేపీఎన్ నగర్, స్టాలిన్ నగర్, దొంగల గుట్ట ప్రాంతాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి ప్రశాంత్ నగర్, కృషి నగర్‌లలో రహదారులపై చేరుతుందని అన్నారు. దీంతో వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, కనుక వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె మురళి, డి.మధుసూదన్, ఈశ్వరమ్మ, లావణ్య, డి.లక్ష్మి, డి.రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.