- ఆలిండియా ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష
- సంఘీభావం తెలిపిన శేరిలింగంపల్లి శివసేన నాయకులు
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్ధులు, బోధనేతర సిబ్బంది, అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఎదుట ఆలిండియా ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు శుక్రవారం శేరిలింగంపల్లి శివసేన నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి శివసేన అధ్యక్షుడు కేశవ, ప్రధాన కార్యదర్శి సంతోష్, నాయకులు అనిల్ గౌడ్, జగన్, ఎం.రాజులు దీక్షా శిబిరాన్ని సందర్శించి నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆలిండియా ఓబీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.అప్పారావు రిజర్వేషన్ల విధానాలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆయన బీసీ విద్యార్థులను, బోధనేతర సిబ్బంది, బోధన అధ్యాపకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్‌సీబీసీకి నివేదికలో పేర్కొన్న ప్రకారం ఓబీసీ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది న్యాయం చేయాలని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు 4, 6, 8 పీహెచ్‌డీ విద్యార్థులను కేటాయిస్తూ ఖాళీగా ఉన్న పీహెచ్‌డీ, ఎంఫిల్ లను భర్తీ చేయాలని, ప్రత్యేక ప్రవేశ డ్రైవ్ నిర్వహించి జూన్ 2020 నోటిఫికేషన్‌లో ఖాళీగా ఉన్న అన్ని పీహెచ్‌డీ స్థానాలను భర్తీ చేయాలని అన్నారు. అదేవిధంగా ఐఓఈ ప్రాజెక్టుల ప్రకారం అధ్యాపక స్థానాల్లో రిజర్వేషన్ల నియామకాన్ని అమలు చేయాలని, ఓబీసీ విద్యార్థులను, అధ్యాపకులను, బోధనేతర సిబ్బందిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని, ఎన్‌సీబీసీ ఇచ్చే ఆదేశాలను కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్, కో ఆర్డినేటర్ నరేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వై.శివకుమార్, నాన్ టీచింగ్ స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రెటరీ రవి, ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, జనరల్ సెక్రెటరీ దుర్గేష్ సింగ్‌లు పాల్గొన్నారు.