శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్లో వర్షాల సమయంలో తలెత్తుతున్న నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ శుక్రవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. మల్కం చెరువు, ఎలక్షన్ కమిషన్ కార్యాలయం, హెచ్సీయూ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన వాటర్లాగింగ్ పాయింట్లను వారు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి ప్రవాహ మార్గాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా సులభంగా ముందుకు వెళ్లేలా చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించారు.

వర్షాల సమయంలో వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా హైడ్రా, ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్లు ఆదేశించారు. గుర్తించిన సమస్యలకు తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత పరిష్కారాలను రూపొందించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, హైడ్రా ఉన్నతాధికారులు, శేరిలింగంపల్లి సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.





