పద్మా నగర్ వార్డులో పౌర సమస్యలపై కమిషనర్ సమీక్ష

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజ‌న పద్మా నగర్ వార్డులో పర్యటించి స్థానిక పౌర సమస్యలు, అభివృద్ధి అవసరాలపై సమీక్ష నిర్వహించారు. కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు, పద్మా నగర్ వార్డు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWAs) ప్రతినిధులు, స్థానిక ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పద్మా నగర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన సమావేశంలో ప్రజలు పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా డ్రైనేజీ, నీటి నిల్వలు, తాగునీటి సరఫరా, రోడ్లు, మ్యాన్‌హోళ్ల మరమ్మత్తులు, అక్రమ పార్కింగ్, వీధి దీపాలు, బహిరంగంగా చెత్త వేయడం వంటి సమస్యలను ప్రస్తావించారు.

అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ పిట్ల ఏర్పాటు, నాలాల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఓపెన్ జిమ్, బస్తీ దవాఖానా, లైబ్రరీ వంటి ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరారు. వార్డులో మెరుగైన రహదారి అనుసంధానం, పారిశుధ్య సేవల బలోపేతం, తరచూ ఎదురవుతున్న డ్రైనేజీ, నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కమిషనర్‌ను కోరారు. ప్రజలు వెల్లడించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. గుర్తించిన సమస్యలపై సకాలంలో తదుపరి చర్యలు తీసుకోవడంతోపాటు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలతో నేరుగా మమేకమై వార్డు స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తిస్తున్నారు. ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here