- మంత్రులతో సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వినతి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్ లో యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్ అనుమతులపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, జడ్పీ చైర్మెన్లు పట్నం సునీత మహేందర్ రెడ్డి, అనిత రెడ్డి, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్లు హరీష్, విద్యాసాగర్, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ కింద చందానగర్ పాపిరెడ్డి కాలనీలో నిర్మించిన వాంబే గృహాలు 15 సంవత్సరాలు గడుస్తుండడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. వాటిల్లో అక్రమంగా నివాసం ఉంటున్న వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. అలాగే ఆయా ఇండ్లలో నిర్వహణ లోపాలు ఉన్నాయని, వసతులు అరకొరగా ఉన్నాయని, కిటికీలు, తలుపులను దొంగిలిస్తున్నారని, దీంతో అక్కడ 390 ప్లాట్లలో నివసిస్తున్న వారు దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారని తెలిపారు.
మొత్తం 390 ఇళ్లను నిర్మించగా.. 300 మంది అక్రమంగా నివాసం ఉంటున్నారని, 90 మంది అసలైన లబ్ధిదారులు ఉన్నారని గాంధీ అన్నారు. లబ్దిదారుల వాటా చెల్లించినా నివాసానికి నోచుకోని వారు 110 మంది వరకు ఉన్నారని అన్నారు. వారికి కేటాయించిన ఇండ్లలో వేరే వారు నివాసం ఉంటున్నారని, కనుక కలెక్టర్, జిహెచ్ఎంసి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గాంధీ కోరారు.
అలాగే చందానగర్ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో 2600 ఫ్లాట్లను నిర్మించగా, 90 శాతం మంది నివాసం ఉంటున్నారని, నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని, నీటి సరఫరా విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయని తెలిపారు. ఎల్లమ్మబండ రాజీవ్ గృహకల్పలో 3340 ఫ్లాట్లను నిర్మించగా 40 శాతం మంది నివసిస్తున్నారని తెలిపారు. నిర్మాణాలు పూర్తయినా వసతులు కల్పించలేదని, మంచినీరు, పైపులైన్లు, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని అన్నారు. అలాగే పత్రిక నగర్ లో జరిగిన అగ్ని ప్రమాద కుటుంబాలకు న్యాయం చేయాలని, జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద ఉన్న గుడిసెల్లో నివసించే వారికి, గృహ పథకం కోసం డీఈలు కట్టి మోసపోయిన కుటుంబాలకు, రోడ్డు వైడెనింగ్ లో గృహాలు కోల్పోయినవారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గాంధీ సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.