శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం లోనే అత్యధిక ప్రజానీకం నివసిస్తున్న ప్రాంతం అని, అత్యధిక ట్రాఫిక్ ప్రాంతం అని అన్నారు. కాలనీ వాసులు ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారని, లింక్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. అపర్ణా హిల్ పార్క్ నుండి గంగారం చెరువు వద్ద హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ రహదారికి కలిపే లింక్ రోడ్డు పనులు, ముంబాయి జాతీయ రహదారి (NH 65) BHEL కల్వర్టు నాలా నుండి శ్రీ దేవి థియేటర్ రోడ్డుకు కలిపే లింక్ రోడ్డు పనులను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన లింక్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని అన్నారు. చందానగర్, బొటానికల్ గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదల నివారణకు ప్రథమ ప్రాధాన్యతగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను చేపడితే రోడ్డు దాటే వృద్ధులకు, విద్యార్థులకు, ప్రజలకు, పాదచారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనతో చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పనులలో వేగం పెంచాలని, సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని అన్నారు. చెరువుల సుందరీకరణ చేపట్టాలని, పటేల్ చెరువు, గంగారం చెరువు, అలీ తలాబ్ చెరువు, చాకలి వాని చెరువు, గోపి చెరువులను సుందరీకరణ చేసి అభివృద్ధి చేయాలని అన్నారు. ఆయా సమస్యలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సానుకూలంగా స్పందించారు.





