వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రి అరెస్టు

శేరిలింగంప‌ల్లి, మే 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తాళం వేసి ఉన్న ఇళ్ల‌లో వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.1 ల‌క్ష విలువైన సొత్తును రిక‌వ‌రీ చేశారు. బుధ‌వారం మియాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ కూక‌ట్‌ప‌ల్లి జోన్ ఏసీపీ ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ లోని సిర్గార్‌పూర్ మండ‌లం ముబార‌క్‌పూర్ గ్రామానికి చెందిన కీస‌రి ప‌వ‌న్‌కుమార్ (24) బ్ర‌తుకు దెరువు నిమిత్తం న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చి కేపీహెచ్‌బీలోని ఇషా బాయ్స్ పీజీ హాస్ట‌ల్‌లో నివాసం ఉంటూ స్థానికంగా ర్యాపిడో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అత‌ని స్నేహితుడు గైని సాయిలు (24) మియాపూర్‌లోని అమ‌న్ కాల‌నీలో నివాసం ఉంటూ స్థానికంగా టీ మాస్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే ఈ ఇద్ద‌రూ విలాసాల‌కు అల‌వాటు ప‌డి డ‌బ్బు కోసం ఇళ్ల‌లో దొంగ‌త‌నాలు చేయ‌డం ప్రారంభించారు. తాళం వేసి ఉన్న ఇళ్లే ల‌క్ష్యంగా దొంగ‌త‌నాలు చేస్తూ జ‌ల్సాల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు వీరిని అత్యంత చాక‌చ‌క్యంగా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు డెల్ ల్యాప్ టాప్‌లు, ఒక వివో వి60 మొబైల్‌, ఒప్పో ఎఫ్‌17 మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రో 6 గ్రాముల బంగారాన్ని వారు నారాయ‌ణ‌ఖేడ్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాక‌ట్టు పెట్టార‌ని, దాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారుగా రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఉంటుంద‌న్నారు. కాగా ప‌వ‌న్ కుమార్‌పై సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని పోలీస్ స్టేష‌న్‌ల‌లో మూడు కేసులు ఇది వ‌ర‌కే న‌మోదు కాగా, హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని ఓ పోలీస్ స్టేష‌న్‌లో ఒక కేసు న‌మోదైంద‌ని, మ‌రో నిందితుడు సాయిలుపై ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి కేసులు న‌మోదు కాలేద‌ని పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు నిందితుల‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకోవ‌డంలో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన మియాపూర్ పోలీసుల‌ను ఏసీపీ ఈ సంద‌ర్భంగా అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here