నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెప్పారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ లో గతంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై గుడిసెలు కాలిపోయిన బాధితులకు జేఎన్ఎన్ యూఆర్ఎం గృహ నిర్మాణ పథకం ద్వారా ఇండ్లు మంజూరైన లబ్దిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రిక నగర్ లో అగ్నిప్రమాదంతో గుడిసెలు దగ్దమైన బాధితులకు సరైన న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇళ్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. దశల వారీగా మిగతా వారికి కూడా ఇండ్లను త్వరలోనే ఇప్పించి సమ న్యాయం చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం మన రాష్ట్ర పథకాలను చూసి దేశమంతా అమలు చేస్తున్నా ఉదాహరణలు ఎన్నో అని తెలిపారు. గుడిసెలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇళ్లు మంజూరు చేయించి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గాంధీకి పత్రికా నగర్ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు కాశీనాథ్ యాదవ్, రాంచందర్, రఘునాథ్, చంద్రమోహన్ సాగర్, ఎర్ర లక్ష్మయ్య, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.