వ‌ర్షాల‌కు అన్ని శాఖ‌ల అధికారులు అల‌ర్ట్‌.. చెరువులు, నాలాల ప‌రిశీల‌న‌..

శేరిలింగంప‌ల్లి, జూన్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వర్షాకాలంలో నీటి నిల్వలు, వరద ముప్పును తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం మంగళవారం నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. ఈ పర్యటనలో తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డా. జి. సృజన, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతోపాటు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులు ముందుగా రాయదుర్గంలోని మల్కం చెరువును సందర్శించి వర్షపు నీటి ప్రవాహ పరిస్థితులు, ఇన్‌లెట్ల పనితీరు, నీటి నిల్వలకు దారితీస్తున్న కారణాలను పరిశీలించారు. చెరువులో నీటి మట్టం అధికంగా ఉండటం, ఇన్‌లెట్ల వద్ద పూడిక పేరుకుపోవడం వల్ల వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు.

తర్వాత ఖాజాగూడ చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు, ఇన్‌లెట్ల వద్ద జరుగుతున్న పూడికతీత పనులు, వర్షపు నీటి కాలువల విస్తరణ, పారుదల మెరుగుదల చర్యలను సమీక్షించారు. అనంతరం మాదాపూర్‌ని దుర్గం చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను పరిశీలించారు. చెరువులో ఇప్పటికే నీటి నిల్వలు అధికంగా ఉండటంతో వర్షపు నీరు సాఫీగా ప్రవహించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించారు. మురుగునీరు, వర్షపు నీటి ప్రవాహాల నిర్వహణలో మరింత సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. విఠల్‌రావు నగర్ ప్రాంతంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వర్షపు నీటి కాలువల పనితీరును పరిశీలించిన అధికారులు, నీటి నిల్వలకు కారణమవుతున్న అడ్డంకులను గుర్తించి వాటి తొలగింపుపై సూచనలు చేశారు. అలాగే కొండాపూర్ సంతోష్ దాబా సమీపంలో కొనసాగుతున్న పూడికతీత పనులు, మొండికుంట వైపు నీటి ప్రవాహ పరిస్థితులు, జూబ్లీ గార్డెన్స్ ప్రాంతంలో హైడ్రా చేపడుతున్న కాలువల శుభ్రపరిచే పనులను సమీక్షించారు.

మియాపూర్లోని గురునాథ్ చెరువు ఇన్‌లెట్లను సందర్శించిన అధికారులు, ఇటీవల చేపట్టిన పూడికతీత పనులు, వరద కాలువల పునరుద్ధరణ చర్యలను పరిశీలించారు. గతంలో ఆక్రమణలతో దెబ్బతిన్న నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం వల్ల చెరువుకు వర్షపు నీరు సాఫీగా చేరే పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. చందానగర్లోని గంగారం చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా అధికారులు పర్యటించారు. పూడికతో నిండిపోయిన కాలువల కారణంగా ప్రధాన రహదారులపై నీటి నిల్వలు ఏర్పడుతున్నాయని గుర్తించి, పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చెరువుల ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు, అనుసంధాన వర్షపు నీటి కాలువలను క్రమం తప్పకుండా నిర్వహిస్తే నీటి నిల్వలు, వరద ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. గుర్తించిన సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ పనుల అమలులో ఎలాంటి అవరోధాలు ఎదురైనా సంబంధిత శాఖలు పోలీసు శాఖ సహకారం తీసుకోవచ్చని తెలిపారు. రహదారులపై నీటి నిల్వలు ఏర్పడితే ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరమవుతాయని, అందువల్ల ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా, పోలీసు, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నివారణ, ఉపశమన చర్యలను వేగవంతం చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here