- సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమల్లోకి నైట్ కర్ఫ్యూ
- పరిస్థితులను పర్యవేక్షించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్
నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనర్, ఏడీజీపి వీసి సజ్జనార్ నైట్ కర్ఫ్యూ పరిస్థితులను పర్యవేక్షించారు. గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ సిగ్నల్స్ వద్ద మంగళవారం రాత్రి 9 గంటలకు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఇది కర్ఫ్యూ కాదని కేర్ ఫర్ యు అని అన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. నైట్ కర్ఫ్యూ నిబంధనలను విధిగా పాటించాలని, పబ్బులు, క్లబ్బులు, బార్లు థియేటర్లు, హోటల్స్ సకాలంలో మూసివేయాలని సూచించారు. హాస్పిటల్స్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, కోల్డ్ స్టోరేజీ, గోడౌన్, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులకు నైట్ కర్ఫ్యూలో మినహాయింపు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, ఎస్వోటి డిసిపి సందీప్, సీఏఆర్ సీఎస్డబ్ల్యూ ఏడిసిపి మాణిక్ రాజ్, ఎస్సి ఎస్సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల, గచ్చిబౌలి ఎస్ హెచ్ఓ సురేష్, మాదాపూర్ ఎస్ పోటీ ఇన్స్పెక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ హెచ్ఓ క్యాస్ట్రో రెడ్డి నైట్ కర్ఫ్యూను పర్యవేక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద పరిస్థితులను ఆయన ఆరా తీశారు.