శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర భారతావని తొలి విద్యాశాఖా మంత్రి, భారతరత్న అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని రిహానా బేగం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డిపార్టుమెంటుకు చెందిన ఆచార్య తాళ్ళ సుమాలిని హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో గుణాత్మక విద్యకు మార్గదర్శి, విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు.

ఆజాద్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడని, స్వాతంత్రోద్యమంలో పది సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడని, ఆజాద్ పండితుడు, కవి, సంపాదకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని అన్నారు. ఆయన బహుభాషా కోవిదుడని, స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యా శాఖామంత్రిగా కొనసాగి విద్యా సంస్కరణలకు విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో గౌరవించి ఆయన జన్మదినమైన నవంబరు 11ను 2008వ సంవత్సరం నుండి జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించి అమలు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకుంటూ నిత్య వ్యాయామం, ధ్యానం ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ IRS ఆఫీసరు భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు G రాములు, G హన్మంతు, K మోహన్, మహేష్ గౌడ్, జగదీష్, విద్యార్థినీ, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






