శేరిలింగంపల్లి, జూలై 19 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా అల్విన్ కాలనీ, మియాపూర్ సర్కిల్‌ల పరిధిలో ఈఆర్‌వో నారాయణ్ అమిత్ క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ పనులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో AEROలు, SIR నోడల్ అధికారులు పాల్గొన్నారు. పరిశీలన సందర్భంగా ఇంటింటికి వెళ్లి BLOలు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం, తిరిగి సేకరించడం, అర్హులైన ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్న తీరును అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి అర్హుడి వివరాలు కచ్చితంగా నమోదు కావాలని సూచించారు.

సర్కిల్ పరిధిలోని వివిధ పోలింగ్ స్టేషన్లలో ఎన్యుమరేషన్ పనుల పురోగతిని సమీక్షించిన అధికారులు, ఇప్పటివరకు సేకరించిన ఫారాల సంఖ్య, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల వివరాలను BLOల నుంచి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా 100 శాతం ఎన్యుమరేషన్ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న BLOలతో నేరుగా మాట్లాడిన నారాయణ్ అమిత్ వారికి ఎదురవుతున్న సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న సందేహాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అందించారు. కొత్తగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతను ఓటరు జాబితాలో చేర్చడం, కొత్తగా నివాసానికి వచ్చిన కుటుంబాల వివరాలు నమోదు చేయడం, చిరునామా మార్పులు, పేర్ల సవరణలు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా మిగలకుండా, డూప్లికేట్ నమోదులు లేకుండా నాణ్యమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా సేకరించిన దరఖాస్తులను అదే రోజు డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, ఎలాంటి బకాయిలు ఉండకుండా BLO సూపర్‌వైజర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. AEROలు రోజువారీగా పురోగతిని సమీక్షిస్తూ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో SIR-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసి, సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేస్తూ పారదర్శకమైన, నాణ్యమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.





