నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల చెరువు సమీపంలో ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు, సామాజిక సేవా రత్న అవార్డు గ్రహీత భేరీ రామచందర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం డీసీ వెంకన్నకు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి వేర్వేరుగా వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నల్లగండ్ల, శ్రీ కృష్ణ కాలనీ, నేతాజీ నగర్ కాలనీ, గుల్ మోహర్ పార్క్ కాలనీ, డాక్టర్ కాలనీ నుంచి చనిపోయిన వారిని నల్లగండ్ల చెరువు దగ్గర ఉన్న స్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్మశాన వాటికలో ఎలాంటి సదుపాయాలు లేక అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన చెత్తాచెదారాన్ని స్మశాన వాటికలోనే వేయడంతో దుర్గందం వెదజల్లుతోందన్నారు. స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి స్నానాల గదులు తదితర మౌలిక వసతులను కల్పించాలని బేరి రామచందర్ కోరారు. నేతాజీ నగర్ అసోసియేషన్ సభ్యులు నరేందర్, యాదయ్య, రమేష్ పంతం వెంకటేష్, శ్రీశైలం బాలరాజ్ సాగర్, భేరీ చంద్రశేఖర్ యాదవ్ తదితరులు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.