నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాలా వరకు రూ.15.88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కి.మీ ల మేర చేపడుతున్న నాలా విస్తరణ పనులలో భాగంగా మదీనగూడ రామకృష్ణ నగర్ లో జరుగుతున్న నాలా విస్తరణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నాలా విస్తరణ పనులను చేపట్టినట్లు చెప్పారు.
శాశ్వత పరిష్కారం దిశగా నాలా విస్తరణ పనులు చేపట్టడంతో ఇక ముంపు సమస్య ఉండదని అన్నారు. నాలా విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని విప్ గాంధీ తెలిపారు. నాలా నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని పనులలో వేగం పెంచాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. నాలా నిర్మాణ పనులపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.