నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి లోని అల్యూమినియం ఫ్యాక్టరీ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని, అలాంటి భూ భకాసురులపై చర్యలు తీసుకొని వెంటనే వారిని అక్కడి నుండి ఖాళీ చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో కేఎన్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆక్రమించిన స్థలాన్ని ఆలిండ్ కంపెనీ కార్మికులు, సీపీఐ కార్యకర్తలతో కలిసి నారాయణ సందర్శించారు. కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కంపెనీ స్థలాన్ని ఆక్రమించి కేఎన్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫెన్సింగ్ వేసిన స్థలాన్ని, కబ్జాకు గురైన క్వార్టర్లలో నివాసం ఉంటున్న కార్మికుల కుటుంబాల ఇబ్బందులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలకు సైతం రక్షణ లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వ స్థలాలను కూడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆక్రమించి కబ్జాలకు పాల్పడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. అందుకు ఆలిండ్ కంపెనీలో కేఎన్ ఆర్ కన్స్ట్రక్షన్ రియలేస్టేట్ కంపెనీ చేస్తున్న కబ్జాలే నిదర్శనమని అన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆధీనంలో నడిచిన కంపెనీకి చెందిన స్థలాన్ని ఉన్న ఫలంగా ఓ ప్రైవేట్ కంపెనీ కబ్జాలకు పాల్పడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ వారికి చెందిన స్థలమే అయితే అర్ధరాత్రి వందలాది మంది రౌడీలను పెట్టి దౌర్జన్యంగా కంచెలు వేయడం ఏంటని ప్రశ్నించారు. ఆలిండ్ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానివ్వబోమని, ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అధికారులు స్పందించక పోతే ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.