నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, గాంధీని హఠావో చేయడం ఎవరి తరం కాదని టీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గం ఎమ్మెల్యే గాంధీని హఠావో చేస్తామని కొంతమంది పనికిరాని మాటలు మాట్లాడుతున్న వారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఉన్నత పదవులు అనుభవించిన వారేనన్నారు. గతంలో వారికి ఏ పేరు లేకున్నా టీఆర్ఎస్ పార్టీ వారికి గుర్తింపునిచ్చి అన్ని విధాల ఉన్నత స్థానాలకు తీసుకెళ్లి పదవులు కట్టబెట్టిన విషయం మరిచిపోవద్దన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయిన శేరిలింగంపల్లి నియోజక వర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తూ ఎన్నో ఫ్లైఓవర్లు, లింకు రోడ్లు, మురికి కాలువలు, సీసీ రోడ్లు, స్కూల్స్, కాలేజీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారన్నారు. మచ్చలేని నాయకుడు మా ఎమ్మెల్యే అని, ఎమ్మెల్యేపై ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చని తమకేమి నష్టం లేదని మిద్దెల మల్లారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి అధికార ఎమ్మెల్యే పై నిందలు వేస్తున్న మీరు రేపు వెళ్తున్న పార్టీ ని విమర్శలు చేయరని ఏం నమ్మకమని ప్రశ్నించారు. మరోసారి ఎమ్మెల్యే గాంధీపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో శేఖర్ గౌడ్, రాజారాం, వై వి రమణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.