మంజీరా పైప్ లైన్ రోడ్డు ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాలి: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గత కొన్ని సంవత్సరాలుగా మంజీరా పైప్ లైన్ రోడ్ పనులు అసంపూర్తిగా నడుస్తూ , ఎప్పుడూ పూర్తవుతాయో తెలియక ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారని, కోట్ల రూపాయలతో కట్టిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుందని, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ప‌లు కాలనీల ప్రజలు తెలియజేయగా హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ అధికారులు మొద్దునిద్ర వీడి తక్షణమే తగిన చర్యలు తీసుకుని రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి కూరగాయల మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

గత కొన్ని సంవత్సరాలుగా మంజీర పైప్ లైన్ రోడ్ పనులు అసంపూర్తిగా నడుస్తూనే ఉన్నాయని, జిహెచ్ఎంసి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వలన రోడ్డు పనుల‌లో జాప్యం జరిగి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు విస్తరణ చేయడానికి నిధులు మంజూరైనా రోడ్డు పనులు వేగంగా ఎందుకు జర‌గ‌డం లేదో అధికారులు తెలియపరచాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనుల విస్తరణ కోసం తాము పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి చందానగర్ డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందించామని, అయినా కూడా అభివృద్ధి పనులలో కమిషనర్, సంబంధిత అధికారులు అలసత్వం వహించడం వలనే నత్త నడకన సాగుతున్నాయన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.

కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కూరగాయల షెడ్లను లబ్ధిదారులకు కేటాయించకపోగా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారని గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజాధనం అన్నా ప్రజా సమస్యలన్నా లెక్కలేకుండా పోయిందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలను తీర్చడంలో విఫలమై, పార్టీలు మారడంలో సఫలీకృతుడైతున్నాడని , ప్రజలు మా ఎమ్మెల్యే ఎక్కడా అని ప్రశ్నించే రోజులొచ్చాయని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుకుంటున్నానని, ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను, డ్రైనేజ్, పారిశుధ్యం , అభివృద్ధి, మౌలిక వసతులపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణయ్య , సత్యనారాయణ రాజు, కోటేశ్వరరావు, దేవాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, పవన్, రాజు, రంగారెడ్డి, బాబు రెడ్డి, పద్మ , సరోజ, శ్రీనివాస్, రాజు యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here