- ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపుదాం
- ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు పోరాడుదాం
- శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జి గజ్జల యోగానంద్ పిలుపు
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జి గజ్జల యోగానంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజాసమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేటినీ నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గ పరిధిలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టలేదన్నారు. చెరువులు కబ్జా అవుతున్నాయని, అధికార పార్టీ నాయకుల కనుసన్నలలోనే కబ్జాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని అన్నారు.

రోడ్లు పాడైపోయి గుంతలుపడ్డాయని, మ్యాన్ హోల్స్ ఎక్కడికక్కడ తెరుచుకుని ఉన్నాయని, వర్షం వస్తే బస్తీలన్నీ జలమయం అవుతున్నాయని అన్నారు. పేదలకు నీడ కరువైందని, వైద్యం అందడం లేదని అన్నారు. సర్కారు విద్య పేద విద్యార్థులకు అందడం లేదని, ఇలా అనేక సమస్యలు శేరిలింగంపల్లిలో ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ తెరాస ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. అందు కోసమే ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేందుకే పాదయాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. ఆ యాత్రను అందరూ విజయవంతం చేయాలని కోరారు. యాత్ర మొదటగా శేరిలింగంపల్లి డివిజన్‌లో ప్రారంభం అవుతుందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అశోక్ బాల్దా, డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి, జైరాములు, బీజెవైఎం కన్వీనర్ జితేందర్ పాల్గొన్నారు.






