శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 28-09-2025 న నిర్వహించనున్న ఎ ఐ ఎఫ్ డి వై రాష్ట్ర స్థాయి ప్లీనరీను విజయవంతం చేయాలని మియాపూర్ స్టాలిన్ నగర్ లో ఎ ఐ ఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎ ఐ ఎఫ్ డి వై నాయకులు మాట్లాడుతూ సంవత్సరానికి కోటి ఉద్యోగాల పేరుతో బిజెపి మూడుసార్లు దేశాన్ని పాలిస్తుంది. మత విశ్వాసాలకు అందలం వేసి శాస్త్రీయ విధానం యువతలో జ్ఞాన బోధన కాకుండా మనువాదాన్ని బోధిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీలకు, కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తుంది. దేశ రక్షణ ఆర్మీ తదితర రిక్రూమెంట్లలో అనేక ఆంక్షలు విధించింది. యువజన అభివృద్ధి ని కూడా నిర్వీర్య పరిచిందన్నారు.

తెలంగాణ ఏర్పడితే ఇంటికో ఉద్యోగం పేరుతో టిఆర్ఎస్ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇదిగో ఉద్యోగాలు, అదిగో నిరుద్యోగ భృతి అంటూ యువజనుల అభివృద్ధి అంటూ రాష్ట్ర యువతను మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారమిచ్చిన యువతకు గత ప్రభుత్వ విధానాల అమలే కొనసాగుతుంది. ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలు నిరుద్యోగ భృతి, క్రీడాభివృద్ధి, సమగ్ర యువజన విధానం, జాబ్ క్యాలెండర్ ప్రకటన పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా 28-09-2025 న బి ఎన్ హాల్ ఓంకార్ భవన్, బాగ్ లింగం పల్లి, హైదరాబాద్ లో జరిగే ఎ ఐ ఎఫ్ డి వై రాష్ట్రస్థాయి ప్లీనరీలో యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎ ఐ ఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ నాయకులు డి మధు సూదన్, ఇస్లావత్ దశరథ్ నాయక్, యం డి సుల్తానా బేగం, డి శ్రీనివాసులు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.





