మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రైతాంగ సాయధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ 12వ వర్ధంతిని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వల్లెపు ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మియాపూర్ ఎంఏ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఓంకార్ వర్ధంతి కార్యక్రమానికి చెందిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ, కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ సభలు, సదస్సులు, ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. ఓంకార్ వర్ధంతి సందర్భంగా ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వాటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి.తుకారాం నాయక్, నాయకురాలు భాగ్యమ్మ, ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్, ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు సుకన్య, టి.అనిల్ కుమార్, ఎ.పుష్ప, కన్నా శ్రీనివాస్, డి.మధుసూదన్, పల్లె మురళి తదితరులు పాల్గొన్నారు.