శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈనెల 19 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజులరామారంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ సభలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన మహాసభలకు చెందిన వాల్ పోస్టర్ను శేరిలింగంపల్లి సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో నేటి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారన్నారు. ప్రజా సమస్యలు ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నారు. దేశంలోనే 100 సంవత్సరాలు నిండిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే అన్నారు. తెలంగాణలో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ సిపిఐ అని, వందల ఎకరాలు భూములను పంచి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసవ కమ్యూనిస్టులు ఎంతో క్రియాశీలమైన పోరాటాలు నిర్వహించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు కె చందు యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం సహాయ కార్యదర్శి కే సుధాకర్, మండల నాయకులు తుపాకుల రాములు, ఎస్ నారాయణ, సురేష్ ముదిరాజ్, రఘు, భాస్కర్, ఎం వెంకటేష్, కే కాసిం, సురేఖ, ఏఐఎస్ఎఫ్ నాయకులు నితీష్, తేజ, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






