శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): పంచాయతీ ఎన్నికల్లో 51 శాతం బీసీలు సర్పంచ్ లు గా గెలుపొందడం శుభపరిణామ మని, ఇదే స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించుకుందామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీల గెలుపు బహుజన రాజ్యం ఏర్పడేందుకు తొలిమెట్టు అని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు ఈ విజయం చెంపపెట్టులాంటిదన్నారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో రాజ్యాధికారం సాదిద్దాం అనే అంశంపై ఎస్.దుర్గయ్య గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి బాలగౌని బాల్ రాజ్ గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ తో మాట్లాడుతూ బీసీలు చైతన్యవంతులయ్యారనడానికి పంచాయతీ ఎన్నికల విజయమే నిదర్శనమన్నారు. బీసీల ఐక్యతకు, బీసీ రిజర్వేషన్ల సాధనకు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యం లో పోరాటాలు ర్యాలీలు, ధర్నాలు అంబేడ్కర్, పూలే విగ్రహాలకు వినతిపత్రాలు అందజేత వంటి నిర్విరామ కార్యక్రమాలతో బీసీ సమాజంలో కదలిక తీసుకొచ్చామన్నారు.

రాజకీయ పార్టీలకతీతంగా తాము బీసీ ఉద్యమాన్ని నడిపించామన్నారు. బీసీల్లో మరింత రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకు సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతామన్నారు. గత బిఆర్ఎస్ పదేండ్ల పాలనలో పటేళ్లు, దొరలకు మాత్రమే రాజ్యాధికారం అప్పగించారని, బీసీలను విస్మరించారన్నారు. బిజెపి కూడా ఏనాడూ బీసీలకు మేలు చేయలేదన్నారు. పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాల్సిందిపోయి అగ్రకులానికి కేటాయించి, బీసీ వ్యతిరేక పార్టీగా బిజెపి నిరూపించుకొన్నదని విమర్శించారు. సమావేశంలో ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ యెలికట్టె విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరు శేఖర్ గంగపుత్ర, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిట్టల నగేశ్ ముదిరాజ్ , మల్లేష్ యాదవ్ , సింగం నాగేష్ గౌడ్ , దామోదర్ గౌడ్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.





