శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించాలని కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు శేరిలింగంపల్లి నియోజకవర్గం సీపీఎం పార్టీ వినతిపత్రం సమర్పించింది. ఈ మేరకు పార్టీ నియోజకవర్గం కార్యదర్శి సి.శోభన్, కార్యవర్గ సభ్యులు కె.కృష్ణ, వి.మాణిక్యం, ఎన్.వరుణ్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్ గ్రామం సర్వే నంబర్ 41/14 లో దాదాపుగా 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అన్నారు.
ఈ ప్రభుత్వ భూమిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ హాస్పిటల్స్‌కి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కొంత భూమిని కేటాయించిందన్నారు. మిగిలిన భూమిని అధికారులు కంచె వేసి రక్షించలేకపోయారన్నారు. ఫలితంగా అనేక చోట్ల ఈ సర్వే నంబర్‌లో కబ్జాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పుడు అదే సర్వే నంబర్‌లో చిత్తూరు అమర్ నాథ్ రెడ్డి అనే వ్యక్తి దాదాపుగా 1 ఎకరం భూమిని కబ్జా చేశాడన్నారు. ఈ కబ్జా వ్యవహారంపై తాము గతంలోనే స్థానిక తహసీల్దార్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఎప్పటికప్పుడు ఆర్ఐకి వాట్సాప్ ద్వారా ఫోన్ లో సమాచారం ఇస్తున్నామని, కబ్జా మాత్రం కొనసాగుతూనే ఉందన్నారు. ఎకరం స్థలంలో భారీ ఎత్తున నిర్మాణాలు కొనసాగిస్తున్నారన్నారు. వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరారు. ఈ భూమికి అనుమతులు ఎలా వచ్చాయి, రెవ్న్యూ అధికారులు ఎన్‌వోసీ ఇచ్చారా, ఈ మొత్తం భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.