శేరిలింగంపల్లి, జూన్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలల పునఃప్రారంభానికి కూకట్పల్లి మండల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను పాఠశాల స్థాయికి చేర్చగా, పునఃప్రారంభం రోజునుంచే వాటి పంపిణీకి చర్యలు చేపట్టినట్లు మండల విద్యాధికారి రవీందర్ రాజు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, కిచెన్ షెడ్ల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్, పాలు పంపిణీ కార్యక్రమానికి తొలి దశలో కూకట్పల్లి మండలంలోని మూడు పాఠశాలలు ఎంపికయ్యాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్పల్లి, మండల ప్రాథమిక పాఠశాల కూకట్పల్లి బాలికలు, మండల ప్రాథమిక పాఠశాల కూకట్పల్లి బాలుర పాఠశాలల్లో విద్యార్థులకు సోమవారం నుంచి బ్రేక్‌ఫాస్ట్ అందజేయనున్నారు.

ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఇప్పటివరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే అందిస్తున్న వర్క్‌బుక్స్‌ను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పంపిణీ చేయనుంది. అలాగే కొత్త డిజైన్లతో రూపొందించిన యూనిఫార్మ్‌లను త్వరలో విద్యార్థులకు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) పెంపుతోపాటు వారి అభ్యసన సామర్థ్యాల మెరుగుదలపై విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు మండల విద్యాధికారి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అవసరమైన అనుమతులు లేకుండా పాఠశాలలు లేదా తరగతులు నిర్వహించరాదని హెచ్చరించారు. అలాగే విద్యార్థుల భద్రత, చైల్డ్ సేఫ్టీ ప్రమాణాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.





