నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్‌లోని ఏరియా హాస్పిటల్‌ను బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ శనివారం సందర్శించారు. రోగులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం సుపరెంటెండెంట్ దశరథ్‌తో చర్చించగా రోగులకు పరిక్షలు చేసేందుకు సరిపడా కిట్స్ లేవని, ఆక్సిజన్ కొరత ఉందని, చికిత్సలు అందించేందుకు పూర్తి సౌకర్యాలు లేవని ఆయన వివరించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వ పెద్దలు, సీఎస్ సోమెష్ కుమార్ ప్రభుత్వ దవఖానాల్లో ఎలాంటి అసౌకర్యం లేదని, అన్ని ఏర్పాట్లు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు బిన్నంగా ఉందని మండిపడ్డారు. కొండాపూర్ హాస్పిటల్‌కు వస్తున్న రోగులు ఎవరైనా పరీక్షలు చేయించుకోలేకా, కరోనా నిర్ధారణ ఐతే మెరుగైన చికిత్స పొందలేక, కనీస మౌళిక వసతులు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెరుగైన వసతులు కల్పించాలని, వచ్చిన రోగులందరికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎంతటి పోరాటానికైన సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాధకృష్ణ యాదవ్, కర్చర్ల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
