- స్నేహితుడి తల్లి అంత్యక్రియలు పూర్తిచేసిన చిన్ననాటి మిత్రులు…
- అన్య మతస్థులైనా.. హిందు సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు…
నమస్తే శేరిలింగంపల్లి: కరోనా విళయతాండవం చేస్తున్న వేళ… ఐన వాళ్లే తమ వారిని పట్టించుకోలేని నేటి పరిస్థితిలో చిన్ననాటి స్నేహితుడి తల్లికి దహణ సంస్కారాలు నిర్వహించి మిత్రుత్వానికి నిజమైన అర్ధాన్ని ఇచ్చారు ముగ్గురు వ్యక్తులు. బిహెచ్ఈఎల్ సెయింట్ ఆన్స్ స్కూల్ పూర్వ విద్యార్థులలో ఇద్దరు సోదరులు అమెరికాలో స్థిరపడ్డారు. వారి తల్లి(70) అనారోగ్యం పాలైంది(కరోనా కాదు). అమెరికా నుంచి రాకపోకలు స్థంభించిన నేపథ్యంలో ఆమె కుమారులు ఇక్కడికి రాలేని పరిస్థితి. దానికి తోడు కరోనా నేపథ్యంలో చుట్టుపక్కల వారు పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో వారి ముగ్గురు మిత్రులు స్నేహితుడి తల్లిని భెల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. విషయం తెలిసినా బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆమె అంతేష్టి భాద్యతను సైతం ఆ ముగ్గురు మిత్రులే తీసుకున్నారు. అన్యమతస్థులు(ఇద్దరు క్రిష్టియన్, ఒకరు ముస్లిం) ఐనప్పటికి ఆ మాతృమూర్తికి హిందూ సాంప్రదాయల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. తాము రాలేకపోయినా తన మిత్రులు దగ్గరుండి తల్లికి వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయడం పట్ల ఆ సోదరులు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా విజృంభన నేపథ్యంలో చాల చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమ కుటుంబంలోను ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే అ తల్లికి ఎదురైన అనుభవం మరెవరికి ఎదురవ్వదు.
