నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి జిల్లా నాయకులు గురువారం కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌ను సందర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గం కొండాపూర్ దవాఖానాలోని తాజా పరిస్థితులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో బిజేపి రంగారెడ్డి అర్భన్ కార్యవర్గం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, లేనిఎడల ఎంతటి పోరాటానికైనా తాము సిద్దమని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్‌లు మాట్లాడుతూ గాంధీ హాస్పటల్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సైతం సందర్శించాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలకు మెరుగైన కరోనా వైద్యం అందించడానికి అన్ని విధాలా కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి శేరిలింగంపల్లి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్. కన్వీనర్ బుచ్చి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు రాధా కృష్ణ యాదవ్, కర్చర్ల ఎల్లేష్, రఘునాథ్ యాదవ్, డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బిజెపి రంగారెడ్డి అర్భన్ కార్యవర్గం ప్రభుత్వానికి చేసిన సూచనలు…
1.కరోనా కంటే భయంతో ఎక్కువమంది మరణిస్తున్న నేపథ్యంలో టెస్టులు, వ్యాక్సిన్స్ కొరకు వస్తున్న వారిలో ధైర్యం నింపే విధంగా సిబ్బంది వ్యవహరించాలి.
2.ప్రతిరోజు కరోనా పరీక్షల కోసం వచ్చే వారందరికీ టెస్టులు చేసే విధంగా తగిన చర్యలు చేపట్ట గలరు.
3 .పేదలు ప్రభుత్వ ఆస్పత్రిలనే ఆశ్రయిస్తారు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సరిపడినన్ని బెడ్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
4.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా వ్యాక్సిన్, కరోనా పరీక్షలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా కరోనా కిట్ల కొరతను తీర్చాలి.
5.ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డబాయ్‌ల కొరత లేకుండా చేసి కోవిడ్ బాధితులకు చికిత్సకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి.
6.ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ నిల్వలు, సిటి స్కాన్, ఎక్స్‌రే వంటి పరికరాలు కూడా అందుబాటుకి తీసుకురావాలి.
7.టెస్టులు, టీకాల కోసం వస్తున్న వారు భౌతిక దూరం పాటించేలా, మాస్కు తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించాలి.
8.బస్తీ దవాఖానలో టీకా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలి .
9.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్‌టీపసీఆర్ పరీక్షలే చేస్తున్నందువల్ల తక్కువ టెస్టులు చేసే పరిస్థితి నెలకొని ఉంది కాబట్టి ర్యాపిడ్ టెస్టులు సైతం పెద్ద మొత్తంలో చేయాలి.
10.ఆస్పత్రుల ప్రాంగణాల్లో రోగుల కోసం కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలి .
11.కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు, రిపోర్టులు అని కాలయాపన చేయకుండా వెంటనే మందుల కిట్ అందించాలి.
