శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఖాటూ శ్యామ్ బాబా జయంతి సందర్భంగా చందానగర్‌లోని గాంధీ విగ్రహం రోడ్ వద్ద భక్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ ఖాటూ శ్యామ్ బాబా ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో శాంతి, సౌఖ్యం, విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే దేవుడిగా శ్యామ్ బాబా విశ్వాసాన్ని మరింత బలపరుస్తారని తెలిపారు. అలాగే, భక్తులతో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని, సమాజంలో ఆధ్యాత్మికత, సానుకూల భావన పెంపొందేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అజిత్, పరదేశి నాయుడు, భాటియా, వెంకటేష్, మధు, భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.





