శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): సినీ నటుడు అక్కినేని నాగార్జునను వివాదాలు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ వివాదం అలా కొనసాగుతుండగానే తాజాగా మరో అంశంలో ఆయన పేరు మళ్లీ బయటకు వచ్చింది. మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను భూ ఆక్రమణ చేసి అక్రమంగా నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఉన్న అయ్యప్ప సొసైటీలో తమ్మిడికుంట చెరువు ఉంది. దీని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని నాగార్జున ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గతంలోనే నివేదిక ఇచ్చారని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. 2021వ సంవత్సరం ఫిబ్రవరి 17న రిపోర్టును సమర్పించారని భాస్కర్ రెడ్డి తెలిపారు. సదరు స్థలం విలువ రూ.100 కోట్ల మేర ఉంటుందన్నారు. ఆ స్థలాన్ని కబ్జా చేసిన నాగార్జున రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించారని అన్నారు. పర్యావరణాన్ని విధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి చెరువును కబ్జా చేయడమే కాక అక్రమంగా నాగార్జున రూ.కోట్లు గడించారని అన్నారు. వెంటనే నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కర్ రెడ్డి తాను మాదాపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు ఆయనకు ఫిర్యాదు కాపీ కూడా ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భాస్కర్ రెడ్డి కోరారు.