- కులమతాలకు అతీతంగా ఉచిత ఐసోలేషన్ సేవలు…
- ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ గాంధీ…
నమస్తే శేరిలింగంపల్లి: ప్రార్ధించే చేతుల కన్నా… సాయం చేసే చేతులు గొప్పవి… అనే నానుడిని ఆచరణలోను చేసి చూపిస్తున్నాడు కల్పరీ వ్యవస్థాపకకుడు బ్రదర్ పి.సతీష్‌కుమార్. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న వేళ తన ఉదారతను చాటుకుంటున్నాడు. నిత్యం వేళాది మంది ప్రార్ధనలు చేసే మందిరాన్ని కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి ప్రజలకు భరోసా కల్పిస్తున్నాడు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని హఫీజ్పేట్లో ఉన్న కల్వరీ టెంపుల్లో 300 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీతో కలసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం కల్వరీ కోవిడ్ కేర్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బెడ్ లు అందుబాటులో ఉంచడంతో పాటు, ఆక్సిజన్, వెంటిలేటర్లకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ జ్వర సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. కరోనా పేషెంట్లకు ఉచితంగా భోజనం అందిస్తున్న బ్రదర్ సతీష్ కుమార్ పెద్ద మనసుతో 300 పడకలతో ఉచిత కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఇంత గొప్ప సేవకు పూనుకున్న కల్వరి వ్యవస్థాపకులు బ్రదర్ పి.సతీష్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. పరిసర ప్రాంతాల నిరుపేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నేశ్రీనివాస్ రావు, స్థానిక నాయకుడు ఎండి అక్తర్ తదితరులు పాల్గొన్నారు.
కల్వరి టెంపుల్ నిర్వాహకుడు బ్రదర్ పి సతీష్ కుమార్ మాట్లాడుతూ చిన్న ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా సోకితో మిగిలిని వారికి వ్యాది సోకే అవకాశ ఉన్న పరిస్థితుల్లో దిక్కుతోచక ఎందరో అవస్థలు పడుతున్నారని, అలాంటి వారికి ఇక్కడ ఉచితంగా ఐసోలేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. సోమవారం నుండి ఇక్కడ కోవిడ్ పెషెంట్లకు వసతితో పాటు, అవసరమైన మందులు, మూడుపూటలా భోజనం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. దాదాపు 100కి పైగా వైద్య సిబ్బంది ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో సేవలందిస్తారని అన్నారు. ప్రస్థుతం ఇక్కడ 300 పడకలతో పాటు 50 ఆక్సిజన్ సిలిండర్‌లు అందుబాటులో ఉంచామని అన్నారు. త్వరలోనే మరో 500 బెడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. కరోనా ఉదృతి తగ్గేంత వరకు కల్వరీ కోవిడ్ కేర్ సెంటర్ సేవలు కొనసాగిస్తామని అన్నారు.
కల్వరి ఉచిత కోవిడ్ సెంటర్ లో సేవలు పొందడిలా…
కుల మతాలకు అతీతంగా కల్వరీలో సేవలు పొందవచ్చు. కరోనా పాజిటీవ్ వచ్చిన వారు ఆ రిపోర్ట్ తో కేంద్రానికి రావాలి. అలాంటి వారికి పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలో ఉన్న వారికి ఈ కేంద్రంలో వసతి కల్పిస్తారు. కరోనా ప్రాథమిక దశ నుంచి ఆక్సిజన్ అవసరం అయ్యేంతవరకు ఇక్కడ సేవలు కొనసాగుతాయి. ఒకవేళ రోగి పరిస్థితి విషమంగా మారే పరిస్థితులు నెలకొంటే మెరుగైన సేవల కోసం ఈ కేంద్రానికి అనుసంధానమై ఉన్న పలు పెద్ద హాస్పిటల్స్‌కు సిఫారసు చేసి, అక్కడకి చేరవేస్తారు.