నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాదాపూర్ డివిజన్ బిజెపి ఇన్చార్జీ గంగల రాధకృష్ణ యాదవ్ శనివారం సందర్శించారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోస్ కోసం పెద్ద మొత్తంలో బారులు తీరిన ప్రజలతో ఆయన మాట్లాడారు. ఉదయం 6 గంటలకు వచ్చి నిల్చున్నా 11 గంటలైనా వ్యాక్సిన్ దక్కలేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాధకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి ప్రాణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి కనీస ఏర్పాట్లు చేయలని మండిపడ్డారు. ఎండలో నిలబడి వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారని, కనీసం టోకెన్ లాంటి సిస్టమ్ ఏర్పాటు చేసి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయమై కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్‌బాబుతో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.