నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రెండు గంటల తర్వాత కొద్దిగా పుంజుకుంది. 10 గంటల వరకు 7 శాతానికి మించని పోలింగ్ శాతం మధ్యాహ్నం 12:00 వరకు 20 శాతానికి చేరుకుంది. శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో మొత్తం 12 పోలింగ్ స్టేషన్లలో కలిపి 20.75 ఓటింగ్ శాతం నమోదు కాగా చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మొత్తం 21 పోలింగ్ స్టేషన్లలో కలిపి 19.52 శాతం పోలింగ్ నమోదయింది. ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, పార్టీ నాయకులతో కలిసి పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితులను ఆరా తీశారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చందానగర్ బీజేపీ కార్పొరేటర్ పోటీదారు కసిరెడ్డి సింధు రఘునాథరెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు శోభన్ లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.