శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): కెనరీ ది స్కూల్‌లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తరగతుల వారీగా పాల్గొని ఈ రెండు కార్యక్రమాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ప్రధమంగా యోగా దినోత్సవం సందర్భంగా యోగాభ్యాసంలో నిపుణత కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు వివిధ యోగా ఆసనాలు, శ్వాస నియంత్రణ పద్ధతులు (ప్రాణాయామం) చేయించారు. యోగా ప్రాముఖ్యతను వివరించే శారీరక ఆరోగ్యానికి, మానసిక శాంతికి ఎంతగానో తోడ్పడే ప్రక్రియగా ఉపాధ్యాయులు వివరించారు. యోగాని మన రోజువారీ జీవన శైలిలో భాగం చేసుకోవాలి అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.
ఆ తరువాత ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని, సంగీత ప్రదర్శనలు నిర్వహించారు. పాఠశాల సంగీత విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు హార్మోనియం, తబలా, కీబోర్డు వాద్యాలతో పాటు గాన ప్రదర్శనలు చేశారు. పాశ్చాత్య సంగీతం నుంచి భారతీయ సంప్రదాయ సంగీతం వరకు విభిన్న ధృవాలలో విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా మాట్లాడుతూ సంగీతం, యోగా రెండూ మనసు, శరీరానికి ఒక శక్తివంతమైన సాధనాలు. ఇవి విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడతాయి. ఇలాంటి కార్యక్రమాలు వారికి చైతన్యం, ఆత్మవిశ్వాసం ఇస్తాయి.. అని అన్నారు.