శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీలో పలు సమస్యలపై సంబంధిత అధికారులు, స్థానికవాసులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చాలా కాలంగా సురభి కాలనీలో ఎదురవుతున్న మురుగునీటి సమస్యను రెండు వారాల్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పారిశుధ్యం పనులలో భాగంగా చెత్త సేకరణపై ఆరా తీశారు. తడి పొడి చెత్త వేరు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించాలని అన్నారు. త్రాగునీటి క్లోరినేషన్, దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా వైర్లు ఇండ్లపై వేలాడకుండా వైర్లను సక్రమంగా సరైన పద్ధతిలో సమాకూర్చాలని ఎలక్ట్రికల్ సిబ్బందికి సూచించారు.

డివిజన్‌లో దశలవారిగా మురుగు నీటి లీకేజీ సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక ప్రజలను ఆత్మీయంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచనలు, సలహాలతో ఈ డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకువస్తామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్, డాక్టర్ AMHO శ్రీకాంత్ రెడ్డి, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, ఏఎంసీ శ్రీనివాస్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, టాక్స్ ఇన్స్పెక్టర్ దీపక్, సురభి కాలనీవాసుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఆర్ వెంకట్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్, సెక్రటరీ సి.వి భాను, వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఏ జయకృష్ణ, జాయింట్ సెక్రెటరీ జితేందర్ రెడ్డి, సలహాదారులు s.a చంద్రశేఖర్, ఆర్ కోదండరావ్, ఆర్ శ్రీనివాస్, యూత్ ప్రెసిడెంట్ పూజిత్ సాయి, వీ.స్వరూప్, ఎలక్ట్రికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, వాటర్ వర్క్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





