నాగర్‌కర్నూల్‌లో పసిపాప మృతి: కుల దాడి ఆరోపణలతో ఉద్రిక్తత

  • బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి : దుండ్ర కుమారస్వామి డిమాండ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఆలయంలో జరిగిన ఘర్షణ అనంతరం రెండు నెలల పసిపాప మరణించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రజకులపై దాడి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో శిశువు మృతి చెందడం అత్యంత విషాదకరమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి తీవ్రంగా ఖండించారు. ఈ అమానుష ఘటన హృదయాన్ని బరువెక్కించేదిగా ఉందని పేర్కొన్నారు. యావత్ బీసీ సమాజం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి, అన్ని విధాలుగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని, శిశువు మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

సంఘటనలో పాత్ర ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే వారి పదవులను తక్షణమే రద్దు చేసి నిష్పక్షపాత విచారణ చేయాలని సూచించారు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా డా. బి.ఆర్. అంబేద్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగంలో పేర్కొన్న సమాన హక్కులు, స్వేచ్ఛలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని, నేటి ఘటన దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలు సామాజిక వివక్షకు గురవుతున్న అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం తరహాలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, తెలంగాణలో బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి భద్రత, పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా క్యాండిల్ లైట్లతో నిరసన తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటించారు. రజక సంఘం, జాతీయ బీసీ ఆధ్వర్యంలో నిరసన పాదయాత్ర నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, రజక సంఘం అధ్యక్షుడు సందీప్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here