శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని కానరీ ది స్కూల్‌లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థుల స్వాగత ప్రసంగం, దేశభక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలు, టెక్ ఫర్ టుమారో.. ఎ న్యూ ఇండియా నాటకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేతాజీ ఏకపాత్రాభినయం, హిందీ కవితా పఠనం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. స్వాతంత్ర్య పోరాటంలో ఎదురైన కష్టాలు, నష్టాలు, త్యాగాలు, అత్యున్నత నిస్వార్థత గురించి విద్యార్థులలో అవగాహన కల్పించడానికి, కేవలం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే ఈ ఒక్క రోజే కాకుండా, ప్రతిరోజూ ప్రార్థనా సమయంలో, ఒక్కో జాతీయ నాయకుడి జీవిత విశేషాలు, స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రలను సృజనాత్మకంగా ప్రదర్శించారు. విద్యార్థులు స్వయంగా ఈ కార్యక్రమాలను రూపొందించి విజయవంతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా మాట్లాడుతూ స్వాతంత్ర్యం చరిత్రలో ఒక పేజీ మాత్రమే కాదని, అది మన దేశం ఆత్మ అని, మన స్వాతంత్ర్య సమరయోధులు ఈ విలువైన బహుమతిని మనకు ఇవ్వడానికి తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. దానిని రక్షించడం, గౌరవించడం మన కర్తవ్యం అని గ్రహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ సీనియర్ స్కూల్ డాక్టర్ నవీన్ కుమార్ ఇమ్మడి, కోఆర్డినేటర్లు అపర్ణ, ముక్తా, అడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






